
తిరుపతి, 04 మే (హి.స.)
తిరుపతిలో ఎస్డబ్ల్యూడీ (వర్షపు నీటి కాలువలు) అవసరం ఉన్నప్పటికీ కార్పొరేషన్లో నిధుల కొరత పట్టి పీడిస్తోంది. యూసీఎఫ్ కింద లక్ష కోట్ల నిధులు కేంద్రం వద్ద ఉన్నాయి. ప్రతిపాదనలు అందిన వెంటనే 25శాతం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే మిగిలిన 75 శాతం వాటా సమీకరించుకోవడంలోనే సమస్య. తిరుపతి కార్పొరేషన్లో వైసీపీ ప్రభుత్వం దిగిపోతూ జీరో బ్యాలెన్స్ చేసి పోయింది. అనేక ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఏదైనా భారీ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులపైనే ఆధారపడే పరిస్థితి నెలకొంది.
87 కిలోమీటర్ల నిర్మాణం
ప్రస్తుతం కేవలం 40 శాతం వరకు మాత్రమే ఉన్న ఎస్డబ్ల్యూడీ కవరేజ్ను వంద శాతం తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎస్డబ్ల్యూడీని తొలి ప్రాధాన్యంగా అధిక జనసాంద్రత గల ప్రాంతాలను, పేదలు, దళిత వాడలను తీసుకున్నారు. నగరంలో ఈప్రాంతాలు 31.25 కిలోమీటర్లు ఉండగా ఇక్కడ నిర్మాణం కోసం రూ.5083.40 లక్షల ఖర్చుతో ప్రణాళికలు వేశారు. అదేవిధంగా రెండో ప్రాధాన్యంగా 35.24 కిలోమీటర్ల కీలక ప్రాంతాలకోసం రూ.3349 లక్షలను, 20.13 కిలోమీటర్ల నగర సరిహద్దు ప్రాంతాలు, కొత్తగా చేరిన ప్రాంతాల కోసం రూ.2918 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం 86.62 కిలోమీటర్లకుగాను రూ.113.51 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV