'కమ్యూనిస్టుల కంచుకోటలకు బీటలు.. దేశమంతా మోదీ వైపే': మెదక్ ఎంపీ రఘునందన్ రావు
ఖమ్మం, 05 మే (హి.స.) దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని, ఖమ్మం జిల్లాలో కూడా ఎర్ర జెండాను తరిమికొట్టి కాకతీయ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేయాలని బీజేపీ జాతీయ నాయకులు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మం నగరంలో పర్యటించి
Mp


ఖమ్మం, 05 మే (హి.స.)

దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులకు

కాలం చెల్లిందని, ఖమ్మం జిల్లాలో కూడా ఎర్ర జెండాను తరిమికొట్టి కాకతీయ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేయాలని బీజేపీ జాతీయ నాయకులు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మం నగరంలో పర్యటించిన ఆయన.. రాష్ట్రంలో 'ఫసల్ బీమా' పథకాన్ని అంగీకరించకుండా రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ నగరంలో ఆయన స్వయంగా వాల్ పెయింటింగ్ వేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర రాజకీయాలపై, అలాగే రైతాంగ సమస్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజల తీర్పు అభివృద్ధి, విశ్వాసం, మంచి పరిపాలన వైపే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అహంకారంతో, కుటుంబ పాలనతో, వ్యక్తి ఆరాధనతో దేశాన్ని పక్కనపెట్టి కేవలం తమ కుటుంబాలు మాత్రమే బాగుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రతి పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతున్నారని పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు జరుగుతున్న పరిణామాలు వివరిస్తున్నాయన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు 'ఇండియా' కూటమి పేరుతో కపట నాటకాలు ఆడుతున్నాయని, ఆ రెండు పార్టీలు కలిసికట్టుగా ఉన్నట్లు నటిస్తున్నప్పటికీ కేరళ రాష్ట్రానికి వచ్చేసరికి ఒకరిపై ఒకరు పోరాడుకుంటూ తమ మధ్య ఎలాంటి ఐక్యత లేదని నిరూపించుకున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు ఈ రెండు పార్టీలను తిరస్కరిస్తున్నారని, గుజరాత్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో

మోదీ నాయకత్వంలో బీజేపీ సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తుచేశారు.

ప్రధాని మోదీ ప్రతి రాష్ట్రాన్ని సమానంగా చూస్తూ కక్ష సాధింపు చర్యలకు తావులేకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న తీరును రఘునందన్ రావు తీవ్రంగా తప్పు పట్టారు. రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల్లో సుమారు 200 ఎకరాల వరి పంట బూడిదపాలై రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గనక రాష్ట్రంలో అమలులో ఉండి ఉంటే ఖమ్మం రైతులకు ఎంతో మేలు జరిగి ఉండేదని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పథకాన్ని అంగీకరించకపోవడం వల్లనే రైతులకు నష్టపరిహారం అందక ఈ దుస్థితి దాపురించిందని విమర్శించారు. రైతుల జీవితాలతో, రాష్ట్ర అభివృద్ధితో రాజకీయాలు చేయవద్దని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. రైతులను గౌరవించిన చోటనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.

రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 1980లో దేశవ్యాప్తంగా బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలు గెలిచినప్పుడు అందులో ఒకరు తెలంగాణలోని హనుమకొండ గడ్డ మీద నుంచి గెలిచిన విషయాన్ని, ఆనాటి పోరాట స్ఫూర్తిని ఆయన గుర్తు చేశారు. అంగ, వంగ, కళింగ దేశాలను గెలుచుకున్న తర్వాత ఇక మిగిలింది కాకతీయ సామ్రాజ్యమేనని, ఈ గడ్డపై కూడా కచ్చితంగా కాషాయ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా కనిపించని ఎర్ర జెండా ఖమ్మం జిల్లాలో కూడా కనిపించవద్దని, దేశ ప్రజలు వదిలించుకున్న వామపక్షాలను ఖమ్మం ప్రజలు కూడా వదిలించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మార్పు కోసం, ఖమ్మం జిల్లా బాగు కోసం కమలం గుర్తుకు ఓటు వేసి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని రఘునందన్ రావు ప్రజలను కోరారు. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం జరిగే ప్రధాని మోదీ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande