
సంగారెడ్డి, 06 మే (హి.స.)
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా అధికారుల బృందం ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంగారెడ్డి ఆర్డీవో రాజేందర్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వైద్యనాథ్, కొండాపూర్ తహశీల్దార్ అశోక్, ఏవో గణేశ్, ఏఈవో ప్రేమ్ రాజ్, పీఏసీఎస్ సీఈవో సిరాజ్తో కలిసి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో ధాన్యం నిల్వలు, తూకం వేసే విధానం, తేమ శాతం పరిశీలన, గన్నీ బ్యాగుల లభ్యత, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి ఆర్డీవో, ఏడీఏ సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలను ఓపీఎంఎస్లో నమోదు చేసి, 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే సద్వినియోగం చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని అధికారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..