
హైదరాబాద్, 05 మే (హి.స.)ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేశాక వసూలు చేసుకోవాలని, అంతవరకు అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లింపునకు ఒత్తిడి తేవద్దన్న ప్రభుత్వ నిబంధనను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ఫీజు బకాయిల చెల్లింపుతో పాటు కొత్త జీవోలోని నిబంధనపై కౌంటరు దాఖలు చేయడానికి మరికొంత గడువు కావాలన్న ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఫీజును విద్యార్థుల ఖాతాలో జమ చేస్తామని, అప్పటిదాకా వారి నుంచి ఫీజు వసూలు చేయరాదన్న జీవో 7లోని నిబంధనను నిలిపివేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ నేపథ్యంలో ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాలు చేస్తూ పలు ప్రైవేటు కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి మరోసారి విచారణ చేపట్టారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.రాహుల్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జీవోలోని 5వ పేరా 12వ నిబంధనతో పాటు 2025-26వ విద్యాసంవత్సరంతో పాటు ఇప్పటిదాకా చెల్లించాల్సిన బకాయిల వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామన్నారు.
ఇప్పటికే పలు కాలేజీలకు టోకెన్లు జారీ అయిన మొత్తాలతో పాటు సంబంధిత సంక్షేమశాఖల ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ విధానం కింద చెల్లింపులు కొనసాగుతాయన్నారు. వీటిపై కౌంటర్లు దాఖలు చేయడానికి గడువు కావాలని కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ జీవోలోని 5వ పేరా 12వ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు సంబంధించిన ఫీజులను డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) పద్ధతిన నేరుగా విద్యార్థుల ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుందని, తరువాత విద్యార్థులు టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన మొత్తాలను ఖాతాల నుంచి చెల్లిస్తారని పేర్కొందన్నారు. దీనివల్ల కాలేజీలు ఫీజులను వసూలు చేసే పరిస్థితి లేదని, ఆ నిబంధనను నిలిపివేస్తూ గత వారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రస్తుత విద్యాసంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ 24లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్