
ఆకివీడు, 06 మే (హి.స.)
,పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నవారికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నిర్మాణ అనుమతులను సవాలుచేస్తూ దాఖలుచేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రాథమిక దశలోనే కొట్టేసింది. ఆ స్థలం విషయంలో వివాదం ఎక్కడుందని పిటిషనర్లను ప్రశ్నించింది. ఆధారాలను పరిశీలిస్తే ఎనిమిది దశాబ్దాలుగా అక్కడ రామాలయం ఉందని, రెవెన్యూ రికార్డులు ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయని పేర్కొంది. ఆ స్థలానికి ఆనుకొని ఉన్న మరో భూమి ఎన్కంబరెన్స్ ధ్రువపత్రాన్ని పరిశీలిస్తే ఉత్తరం వైపు హద్దు రామాలయం ఉన్నట్లుగా రుజువు కనపడుతోందని వ్యాఖ్యానించింది. రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమిని ప్రభుత్వ పోరంబోకుగా నిర్వచించి.. పట్టాదారు కాలమ్లో ‘గుడి’గా పేర్కొన్నారని వెల్లడించింది.
కోర్టు ముందున్న వివరాలను పరిశీలిస్తే 80 ఏళ్లుగా అక్కడ రామాలయం ఉన్నట్లు నిర్ధారణ అవుతోందని వ్యాఖ్యానించింది. తహసీల్దార్, ఆర్డీవో నివేదికలు, రెవెన్యూ రికార్డులను పరిశీలించాకే జిల్లా కలెక్టర్ రామాలయం నిర్మాణానికి ఎన్ఓసీ (నిరభ్యంతర పత్రం) జారీచేశారని గుర్తుచేసింది. 8 దశాబ్దాలుగా రామాలయం ఉన్న స్థానంలో పునర్నిర్మాణం చేపట్టడం తప్పెలా అవుతుందని ప్రశ్నించింది. ఈ నిర్మాణాన్ని అక్రమ కట్టడంగా పేర్కొనలేమని తేల్చిచెప్పింది. ప్రభుత్వస్థలంలో మత సంబంధ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదన్న వాదన ప్రస్తుత రామాలయం విషయంలో వర్తించదంటూ వ్యాజ్యాన్ని కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని పెద్దపేటలోని సర్వే నంబరు 470/12లో రామాలయం నిర్మాణానికి అధికారులు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ పెద్దపేటకు చెందిన జ్యోత్స్న, మరో ఇద్దరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వారి తరఫున న్యాయవాది జడ శ్రావణ్కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ భూమిలో రామాలయ నిర్మాణం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు హడావుడిగా అనుమతులు మంజూరు చేశారన్నారు. అనుమతులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చి, వ్యాజ్యాన్ని కొట్టేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ