ముంబైలో రూ.248 కోట్ల ఫ్లైఓవర్ నిర్మాణం.. ప్రారంభించిన మూడో రోజే కుంగిన రోడ్డు
ముంబైలో రూ.248 కోట్ల ఫ్లైఓవర్ నిర్మాణం.. ప్రారంభించిన మూడో రోజే కుంగిన రోడ్డు
ముంబై


ముంబై, 11 జూన్ (హి.స.)

ముంబైలో రూ.248 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభమైన కొన్ని రోజులకే నాణ్యతా లోపాలతో వివాదానికి కేంద్రంగా మారింది. గోరెగావ్లో కొత్తగా ప్రారంభించిన మృణాల్తాయ్ గోరే ఫ్లైఓవర్ రోడ్డు కుంగిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేపై ట్రాఫిక్ తగ్గించేందుకు ఈ ఫ్లైఓవర్ను విస్తరించారు. జూన్ 6న మేయర్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. అయితే, రెండు రోజులు గడవకముందే రోడ్డు ఉపరితలం ఎగుడుదిగుడుగా మారి, పగుళ్లు ఏర్పడ్డాయి. ఓ చోట ఆపి ఉంచిన బైక్ స్టాండ్ తారు రోడ్డులోకి లోతుగా దిగబడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తీరుపై నెటిజన్లు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై కాంగ్రెస్, శివసేన (UBT) పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దీనిపై స్వతంత్ర సంస్థతో నాణ్యత తనిఖీ (Quality Audit) జరపాలని డిమాండ్ చేశాయి. అయితే, ఈ ఆరోపణలపై బీఎంసీ అధికారులు వింత వాదన వినిపించారు. మాస్టిక్ తారు వేసినప్పుడు ఇలా జరగడం సాధారణమేనని, వాహనాల రాకపోకలతో రోడ్డు దానంతట అదే సర్దుకుంటుందని వివరణ ఇచ్చారు. వివాదం ముదరడంతో మేయర్ రీతూ తావ్డే ఫ్లైఓవర్ను పరిశీలించి, లోపాలను సరిచేయాలని ఇంజనీర్లను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande