
అయోధ్య, 14 జూన్ (హి.స.)
అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల మీద దర్యాప్తు చేయడానికి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సిఫార్సు మేరకు ఉత్తర్ప్రదేశ్లో యోగి సర్కార్ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా శనివారం రాత్రి పోలీసులు ఒక రామమందిర ఉద్యోగి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన కానుకలు (విరాళాలు) నిర్వహించే బాధ్యత కలిగిన ఆ ఉద్యోగిని పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఆవు పేడ కుప్పలో డబ్బు
పోలీసులు ఆ ఉద్యోగి ఇంటి నుంచి రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంత నగదు బీరువాలో లభించగా, మిగిలినది ఆవు పేడ కుప్పలో దొరికింది. సదరు ఉద్యోగి ఇటీవల లక్షల రూపాయల విలువైన భూమిని కొనుగోలు చేసిన విషయం కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఆలయానికి వచ్చే విరాళాలను నిర్వహించే బాధ్యత కలిగిన ఈ ఉద్యోగి ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. అతడి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గానీ, పోలీసులు నుంచి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అసలేంటీ కేసు?
రామమందిర విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన వివాదం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆలయ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ మహిపాల్ సింగ్ సుమారు రూ.7 కోట్ల విరాళాలు అపహరణకు గురయ్యాయని ఆరోపించారు. ఆలయ కానుకల లెక్కింపు సమయంలో భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. తాను స్వయంగా అప్రమత్తంగా ఉండి, సుమారు రూ.5 లక్షల నగదు దొంగతనాన్ని ఒకసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని చెప్పారు. ఆ తర్వాత ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఏం చర్యలు తీసుకోకపోగా, తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించారు. ఆలయ ప్రాంగణంలోని కీలకమైన సీసీటీవీ ఫుటేజీని ఉద్దేశపూర్వకంగా తొలగించారని, భక్తులు సమర్పించిన బంగారం, వెండి, ఇతర విలువైన ఆభరణాలకు సంబంధించి ఎలాంటి పారదర్శకమైన డిజిటల్ రికార్డులు నిర్వహించలేదని తెలిపారు. అయితే ఈ ఆరోపణలను రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కొట్టిపారేసింది. ఇది పథకం ప్రకారం సృష్టించిన పుకార్లు, బురద జల్లే ప్రచారం తప్ప మరేమీ కాదని స్పష్టం చేసింది.
సిట్ ఏర్పాటు- 15 రోజుల్లో నివేదిక
అయితే ఆలయ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ మహిపాల్ సింగ్ ఆరోపణలపై అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీతో సహా పలు రాజకీయ పార్టీలు బీజేపీని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సిట్ ఏర్పాటు చేయాలని యోగి ప్రభుత్వాన్ని కోరింది. రామమందిర విరాళాలపై వచ్చిన ఆరోపణలపై శనివారం యూపీ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్లో లఖ్నవూ డివిజనల్ కమిషనర్ (ఏఐఎస్) విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ రేంజ్ (ఐపీఎస్) కిరణ్ ఎస్, ప్రత్యేక కార్యదర్శి (ఆర్థిక శాఖ) నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం ఏడు రోజుల్లో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను, 15 రోజుల్లో తుది నివేదికను సమర్పించనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi