
రాంచీ, 14 జూన్ (హి.స.) ఝార్ఖండ్ రాష్ట్రంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పిడుగులు పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటనలు జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. గత 24 గంటలుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన ఘోర పిడుగుపాటు (Lightning Strikes) ఘటనలలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నట్లు స్థానిక పోలీసులు అధికారికంగా ధృవీకరించారు.
పోలీసుల నివేదిక ప్రకారం.. రాజధాని రాంచీ (Ranchi) జిల్లా పరిధిలో ఇద్దరు వ్యక్తులు పిడుగుపాటుకు మరణించారు. పిథోరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బధు గ్రామానికి చెందిన జితు మహ్లి (55), కతాంకులి గ్రామానికి చెందిన నిరాశో దేవి (33) తమ పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా.. ఒక్కసారిగా వారిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు ఛత్రా జిల్లాలోని పాతల్గఢ్ ఇద్దరు సొంత అక్కాచెల్లెళ్లు (భార్యలు), కొడర్మాలో పెళ్లి వేడుకల వేళ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు (తల్లి, కొడుకు, అత్త) పిడుగుపాటుకు బలవడంతో ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. తూర్పు సింగ్ భూమ్ జిల్లాలోనూ ఒక యువతి మరణించగా, ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు