
ఢిల్లీ, 14 జూన్ (హి.స.)
ఢిల్లీ యమునా నది తీరాన్ని శుభ్రపరిచేందుకు చేపట్టిన భారీ 'మా యమునా నదీతీర స్వచ్ఛత అభియాన్' కార్యక్రమంలో భాగంగా వందలాది టన్నుల వ్యర్థాలను విజయవంతంగా తొలగించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. జాతీయ రాజధాని పరిధిలోని దష్మేష్ ఘాట్, హాథీ ఘాట్ సహా మొత్తం 28 ప్రధాన ఘాట్లలో ఆదివారం ఉదయం 6 గంటలకే ఈ స్వచ్ఛతా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మెగా డ్రైవ్లో 500కు పైగా సామాజిక, మత, విద్యా సంస్థల ప్రతినిధులతో పాటు వేలాది మంది స్వచ్ఛంద సేవకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొని పెద్ద ఎత్తున శ్రమదానం చేశారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా, మంత్రి పర్వేష్ వర్మ, ఎమ్మెల్యే శిఖా రాయ్ వంటి ప్రముఖ నాయకులు స్వయంగా రంగంలోకి దిగి నదీ తీరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇళ్లలోని పూజా సాగ్రి, వ్యర్థాలను నదిలో పడేయడం ద్వారా మనం ఏ దేవుడిని ప్రసన్నం చేసుకోలేమని, యమునా నది కలుషితమైతే ఏ దైవమూ సంతోషించదని పౌరులను హెచ్చరించారు. కేవలం నదిని శుభ్రం చేయడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో సామూహిక బాధ్యతను పెంచడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. నది పునరుజ్జీవనం కోసం కేంద్ర హోం శాఖతో కలిసి పూడికతీత, మురుగునీటి శుద్ధి, వ్యర్థాల నిర్వహణ వంటి దీర్ఘకాలిక ప్రణాళికలపై పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇందులో భాగంగా భవిష్యత్తులో యమునా నదిలోకి మురుగునీరు చేరకుండా చూసేందుకు, ఢిల్లీలోని మురుగునీటి శుద్ధి కర్మాగారాల (STPs) సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 814 మిలియన్ గ్యాలన్ల నుండి 1,500 మిలియన్ గ్యాలన్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi