స్వదేశీ కామికాజీ డ్రోన్ల తయారీకి ఐఏఎఫ్ శ్రీకారం
స్వదేశీ కామికాజీ డ్రోన్ల తయారీకి ఐఏఎఫ్ శ్రీకారం
drone


హైదరాబాద్, 17 జూన్ (హి.స.)

రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించే దిశగా భారత వాయుసేన (IAF) మరో కీలక అడుగు వేసింది. దేశీయ పరిజ్ఞానంతో సుదూర లక్ష్యాలను ఛేదించగల 'కామికాజీ' డ్రోన్ల (లోయిటరింగ్ మ్యూనిషన్స్) తయారీ కోసం ఒక ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. ఎంపిక చేసిన స్వదేశీ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వాయుసేన ప్రకటించింది.

ఈ ప్రాజెక్టు నిమిత్తం జూన్ 12న పరిమిత టెండర్లను ఆహ్వానించారు. కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉన్న '5 బేస్ రిపేర్ డిపో' (BRD) ఈ ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. కేవలం కొనుగోలుకే పరిమితం కాకుండా, ఈ డ్రోన్ల రూపకల్పన, అభివృద్ధి మరియు తయారీ ప్రక్రియలో వాయుసేన నేరుగా భాగస్వామి కానుంది. దీనివల్ల అత్యాధునిక సాంకేతికతపై పూర్తి నియంత్రణ ఉండటంతో పాటు, మేధో సంపత్తి హక్కులు (IPR) కూడా వాయుసేన వద్దే ఉంటాయి.

పగలు, రాత్రి వేళల్లో.. సుమారు 16,000 అడుగుల గరిష్ఠ ఎత్తులో ఈ డ్రోన్లు సమర్థవంతంగా పనిచేసేలా వీటిని రూపొందించనున్నారు. 'ఫిక్స్డ్-వింగ్' వ్యవస్థ కలిగిన ఇవి, గగనతలంలో చక్కర్లు కొడుతూ శత్రు లక్ష్యాలను గుర్తించి, కచ్చితత్వంతో ఢీకొట్టగలవు. ఇటీవలి యుద్ధాల్లో డ్రోన్ల ప్రాధాన్యత గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, రక్షణ అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని వాయుసేన ఈ నిర్ణయం తీసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande