ఝార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. క్రాస్ ఓటింగ్తో కాంగ్రెస్కు కోలుకోలేని షాక్!
ఝార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. క్రాస్ ఓటింగ్తో కాంగ్రెస్కు కోలుకోలేని షాక్!
Congress Party


ఝార్ఖండ్, 19 జూన్ (హి.స.)ఝార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీలో స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, సొంత కూటమిలోనే జరిగిన క్రాస్ ఓటింగ్ (తిరుగుబాటు ఓటింగ్) కారణంగా ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 81 మంది సభ్యులున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో అధికార ఇండియా కూటమికి 56 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీని ప్రకారం రెండు స్థానాలనూ ఈ కూటమి సులువుగా గెలవాల్సి ఉండగా.. అంతర్గత కుమ్ములాటలు, సమన్వయ లోపం కారణంగా ఎన్డీఏ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వాని ఊహించని విజయాన్ని అందుకున్నారు. మరో స్థానంలో జేఎంఎం అభ్యర్థి బైద్యనాథ్ రామ్ 30 ఓట్లతో సులువుగా విజయం సాధించారు.

తీవ్ర ఉత్కంఠ రేపిన రెండో స్థానం పోరులో, కేవలం 24 మంది ఎమ్మెల్యేల బలమున్న ఎన్డీఏ కూటమి వ్యూహాత్మకంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ పరిమళ్ నత్వానిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించింది. జూన్ 18న జరిగిన కౌంటింగ్లో నత్వానికి 28 ఓట్లు రాగా, ఆయనతో పోటీ పడిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా కేవలం 20 ఓట్లు మాత్రమే సాధించి పరాజయాన్ని చవిచూశారు. పోలైన ఓట్లలో మూడు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ ఫలితం రాగానే బీజేపీ శ్రేణులు అసెంబ్లీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. తన విజయానికి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, స్థానిక బీజేపీ నాయకత్వానికి నత్వాని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికవడం, అందులోనూ ఝార్ఖండ్ నుంచి మూడోసారి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande