
ఢిల్లీ,,20 జూన్ (హి.స.)ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష, అణుశక్తి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు విజయవంతంగా హిట్ అయ్యాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ శనివారం కొనియాడారు. శనివారం నాటి ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఒకవేళ కొన్ని ప్రయత్నాలలో తాత్కాలికంగా వెనుకబడినప్పటికీ, ఆ తర్వాతి చర్యలు అంతకంటే పెద్ద విజయాలను (బిగ్గర్ హిట్) అందించాయని పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా భారతదేశ చంద్రయాన్ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, చంద్రయాన్-2 ఆశించిన ఫలితాలను ఇవ్వనప్పటికీ, చంద్రయాన్-3 ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. అమెరికా, రష్యాల కంటే భారత్ అంతరిక్ష ప్రయోగాలను ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ, ప్రధాని మోదీ అందించిన విధానపరమైన మద్దతు వల్లే నేడు గ్లోబల్ బెంచ్మార్క్లను అందుకోగలుగుతున్నామని స్పష్టం చేశారు.ఇదే తరుణంలో అణుశక్తి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి తీసుకువచ్చిన 'శాంతి' (SHANTI) బిల్లు దేశీయ వృద్ధికి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) కొత్త మార్గాలను తెరిచిందని మంత్రి వివరించారు. ఈ సంస్కరణల ద్వారా 2047 నాటికి భారతదేశ విద్యుత్ ఉత్పత్తిలో అణుశక్తి వాటా 15 శాతానికి చేరుకుంటుందని, పునరుత్పాదక ఇంధన వనరుల (Renewables) వాటా దాదాపు 75 శాతానికి పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. దేశంలో పరిశోధన మరియు అభివృద్ధి (R&D) వ్యయం 2014 నుండి రెట్టింపు అయిందని సింగ్ తెలిపారు. ప్రతిష్టాత్మక 'గగన్యాన్' మిషన్ కింద వచ్చే ఏడాది (2027) కనీసం ఒక వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi