

కోల్కతా, 21 జూన్ (హి.స.): ప్రపంచ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ ఏడాది 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా' అనే థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'దేశం, ప్రపంచం మెుత్తాన్ని యోగా అనుసంధానించినట్లు కనిపిస్తోంది. యోగా ప్రతి ఒక్కరినీ కలుపుతుంది, ఏకం చేస్తుంది. ఈ రోజు నేను బెంగాల్లో ఉండటం చాలా ప్రత్యేకమైనది. రామకృష్ణ పరమహంస వంటి సాధువులు అవతరించిన ఈ పవిత్ర బెంగాల్ భూమి నుంచే స్వామి వివేకానంద యోగాను యావత్ ప్రపంచానికి పరిచయం చేశారు. లహరి మహాశయుల వంటి యోగులు ఈ సంప్రదాయాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. అలాంటి ఈ గడ్డపై సామూహికంగా యోగా చేయడం ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తోంది. వయస్సు, మానవ సామర్థ్యాన్ని తగ్గించకుండా ఉండేలా మనం కృషి చేయగలం. అందుకు యోగా తోడ్పడుతుంది. మానవ జీవితం నిరంతర అభివృద్ధి కోసం ఇది సహాయపడుతుంది.
20 ఏళ్ల వయస్సులో ఉన్న దాని కంటే 40 ఏళ్ల వయస్సులో మరింత ఆరోగ్యంగా ఉండటమే మన లక్ష్యం కావాలి. 30 ఏళ్ల వయస్సులో ఉన్న దాని కంటే 50 ఏళ్ల వయస్సులో మరింత శక్తివంతంగా ఉండటమే మన లక్ష్యం కావాలి. మన శరీరాలను దృఢంగా తీర్చిదిద్దడంలో యోగా సహాయపడుతుంది. ప్రశాంతమైన, ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికీ సహకరిస్తుంది. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయాలి. మన గురించి మనకు ఎంత ఎక్కువగా తెలిస్తే, మనల్ని మనం అంత బాగా నిర్వహించుకోగలం' అని చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV