
హైదరాబాద్, 21 జూన్ (హి.స.)
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం రేకెత్తిస్తూ.. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. సుమారు రూ.440 కోట్ల నిధులున్న ఈ ఖాతాలపై వేటు పడటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీలో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
తిరుగుబాటు నేత రిత్నబ్రత బెనర్జీ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బిధానగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు ప్రారంభమయ్యాయి. పార్టీ ఖాతాల్లో జమ అయిన నిధుల మూలాలపై సమగ్ర విచారణ జరపాలని, అందులో కట్ మనీ, బలవంతపు వసూళ్లు, ప్రజాధనం దుర్వినియోగం వంటి అక్రమాలు ఉన్నాయని వారు ఆరోపించారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. కోల్కతాలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సెంట్రల్ ప్లాజా బ్రాంచ్లో ఉన్న పార్టీ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ (డెబిట్ ఆపరేషన్స్) నిలిపివేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు.
ఇటీవలి ఎన్నికల అనంతరం టీఎంసీలో విభేదాలు పొడచూపిన విషయం విదితమే. ఈ క్రమంలోనే పార్టీ మాజీ కోశాధికారి అరూప్ బిస్వాస్ జూన్ 12న బ్యాంకు యాజమాన్యానికి లేఖ రాస్తూ.. పార్టీలో అంతర్గత వివాదాలు ఉన్నందున లావాదేవీలను నిలిపివేయాలని అభ్యర్థించారు. అయితే, తిరుగుబాటు ఎమ్మెల్యేల ఫిర్యాదుతో ఈ వ్యవహారంలోకి పోలీసులు ప్రవేశించి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ పరిణామాలను టీఎంసీ అధికారిక వర్గాలు తీవ్రంగా ఖండిస్తూ, ఇదంతా రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తున్నాయి. తమ పార్టీ ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగానే ఉన్నాయని, ఈ వ్యవహారాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశాయి. మరోవైపు, అరూప్ బిస్వాస్కు పార్టీ ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే, పార్టీ నిధులపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సిందేనని తిరుగుబాటు వర్గం పట్టుబడుతోంది. ఈ తాజా ఘటనతో పార్టీ ఆస్తులు, ఉనికి కోసం సాగుతున్న ఆధిపత్య పోరు మరింత ముదిరినట్లయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi