
చెన్నై, 21 జూన్ (హి.స.)తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ సభ్యత్వ నమోదులో రెండు కోట్ల మైలురాయిని అధిగమించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, అధికార పగ్గాలు చేపట్టిన కొద్ది వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ మేరకు పార్టీ వర్గాలు శనివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి.
'మై టీవీకే' మొబైల్ యాప్ ద్వారా చేపట్టిన డిజిటల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్కు విశేష స్పందన లభించడంతో సభ్యుల సంఖ్య భారీగా పెరిగినట్లు పార్టీ వెల్లడించింది. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పక్షంగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం వంటి మిత్రపక్షాల మద్దతుతో మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విజయంతో రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి తెరపడినట్లయింది.
2024 ఫిబ్రవరిలో నటుడు విజయ్ ఈ పార్టీని స్థాపించారు. ఎన్నికలకు ముందే పార్టీ సభ్యుల సంఖ్య సుమారు 1.5 కోట్ల నుంచి 1.8 కోట్ల మధ్య ఉన్నట్లు అంచనా వేయగా, పార్టీ ఆవిర్భావ సమయంలోనే నిర్దేశించుకున్న రెండు కోట్ల సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని ఇప్పుడు చేరుకుంది. కేవలం తమిళనాడు నివాసితులకు మాత్రమే ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసి సభ్యత్వం కల్పిస్తున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi