‘ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడా?
‘ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడా?
aap


హైదరాబాద్, 25 జూన్

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ అభ్యర్థి, 23 ఏళ్ల నందని బోస్మియా అనుమానాస్పద స్థితిలో మరణించారు. గుజరాత్లోని రాజ్కోట్లో ఈ నెల 22న సాయంత్రం ఆమె తన అద్దె ఫ్లాట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. పోలీసులు దీనిని ప్రాథమికంగా ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ.. ఆమెతో సహజీవనం చేస్తున్న వివాహితుడైన ప్రియుడే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

గత ఏడాది జరిగిన జెట్పూర్-నవగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ తరఫున పోటీ చేసిన నందని ప్రస్తుతం మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నారు. గొండాల్ చౌక్డీ సమీపంలోని ఆగమన్ సిటీ నివాస సముదాయంలో ఐదో అంతస్తులో ఉన్న ఫ్లాట్లో ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు. నందని ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వచ్చి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

నందని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో జునాగఢ్కు చెందిన అస్లాం హుస్సేన్ సమా అనే వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అస్లాంకు ఇదివరకే పెళ్లయినప్పటికీ నందనితో రాజ్కోట్లో లివిన్ రిలేషన్షిప్లో ఉంటున్నాడు. తన మొదటి భార్యతోనూ అతడు సంబంధాలు కొనసాగించడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. అస్లాం ఆమెను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించేవాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

అస్లాం ఒత్తిడి కారణంగా నందిని తన నగలను తాకట్టు పెట్టడమే కాకుండా, చిన్న వయసులోనే గర్భాశయ తొలగింపు శస్త్రచికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చిందని కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో జునాగఢ్లో అస్లాం బంధువులు నందనిపై దాడి చేశారు. దీనిపై పోలీసు కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం నిందితుడు అస్లాం పరారీలో ఉన్నాడు.

రాజ్కోట్ తాలూకా పోలీసులు ప్రస్తుతానికి దీనిని అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో ఇది ఉరివేసుకోవడం వల్లే జరిగిన మరణంగా తేలినప్పటికీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఫోరెన్సిక్ పోస్టుమార్టంకు ఆదేశించారు. ఈ జంట మధ్య ఉన్న వివాదాలు, పాత గొడవలను పోలీసులు ధ్రువీకరించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, పోస్టుమార్టం పూర్తి నివేదిక వచ్చాకే ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే విషయంలో స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande