
హైదరాబాద్, 10 జూన్ (హి.స.)
హైదరాబాద్లో దారుణం జరిగింది. అనుమానంతో మల్కాజ్గరిలో భార్యను భర్త తుపాకీతో కాల్చి చంపాడు.
వివరాల్లోకి వెళ్తే.. మల్కాజ్గరికి చెందిన అరుణ్ అనే వ్యక్తికి పదేళ్ల క్రితం ఓ మహిళతో పెళ్లయ్యింది. వివాహం అనంతరం భార్యతో విబేధాలు తలెత్తాయి. అరుణ్ వేధింపులు తట్టుకోలేక ఆమె దూరంగా ఉంటోంది. మొదటి భార్య వదిలేసి వెళ్లిపోవడంతో ఆమె సొంత చెల్లెలు ఉషారాణితో అరుణ్ సహజీవనం మొదలుపెట్టాడు. ఐదేళ్ల క్రితం యాదగిరిగుట్టలో ఉషారాణిని వివాహం చేసుకున్నాడు.
అప్పటినుంచి అరుణ్, ఉషారాణి మల్కాజ్గరిలోని మారుతి నగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. అయితే ఉషారాణి మరొకరితో సన్నిహితంగా ఉంటోందని, చాటింగ్ చేస్తోందని అరుణ్ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో కొద్ది నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. గొడవల కారణంగా ఉషారాణి సైతం భర్తకు దూరంగా ఉంటోంది. దీంతో భార్య మీద పగ పెంచుకున్న అరుణ్.. ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇవాళ మాట్లాడుకుందాం రమ్మని ఇంటికి పిలిచి తుపాకీతో కాల్చాడు.
బుల్లెట్ తగలడంలో ఉషారాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు