
పూణె, 04 జూన్ (హి.స.)
పూణెకు చెందిన ఐటీ సంస్థ ‘థింక్టెక్ ఇండియా’ తన కార్యకలాపాలను అకస్మాత్తుగా నిలిపివేసింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న 700 మందికి పైగా ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ఆఫీసులకు తాళాలు వేసి ఉండటం, కంపెనీ ప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు రావలసిన బకాయి జీతాలు, సెక్యూరిటీ డిపాజిట్లు ఇప్పించాలంటూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈ పరిణామంపై పోలీసులు రంగంలోకి దిగారు. ఆర్థిక అక్రమాలు, మోసాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా కంపెనీ సీఈఓ హర్షల్ ఠాక్రేను పోలీసులు అరెస్ట్ చేశారు.
25 ఏళ్ల వయసున్న ఇంటర్న్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు సంస్థ ఆర్థిక లావాదేవీలపై లోతైన దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత మరో 30 మందికి పైగా ఉద్యోగులు, ఇంటర్న్లు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. తమకు జీతాలు ఇవ్వలేదని, స్టైపెండ్లను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ నుంచి వసూలు చేసిన డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు పేర్కొన్నారు.
నిజానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏప్రిల్లో ఈ కంపెనీని మూసివేసినట్లు ఉద్యోగులు తాజాగా పోలీసులకు తెలిపారు. ఎప్పటిలాగే ఆఫీసుకు వచ్చిన తమకు తాళాలు వేసి కనిపించాయని చెబుతున్నారు. కానీ, వాళ్లు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో మోసపోయామని తాజాగా గ్రహించారు. కంపెనీ ప్రతినిధులను సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ కేసులో సీఈఓతో పాటు కంపెనీ ట్రైనింగ్ హెడ్, హెచ్ఆర్ మేనేజర్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారిక లాప్టాప్లు, ఇతర పరికరాల కోసం అంటూ ఉద్యోగులు, ఇంటర్న్ల నుంచి కంపెనీ సుమారు రూ.15,000 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi