
ఢిల్లీ, 05 జూన్ (హి.స.)
కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంటరీ విద్యా కమిటీ
చైర్మన్ దిగ్విజయ్ సింగ్ దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్షల పేపర్ లీకేజీలు, అక్రమాలపై శ్వేతపత్రం విడుదల
చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇటీవల నీట్-యూజీ
పరీక్ష పేపర్ లీక్ అనుమానాలతో రద్దు కావడంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ఆయన ఈ
లేఖ రాశారు.
గడిచిన ఎనిమిదేళ్లలో నేషనల్
టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన పరీక్షల్లో జరిగిన లీకేజీలు, అవకతవకల పూర్తి వివరాలను
ప్రభుత్వం బహిరంగపరచాలని దిగ్విజయ్ సింగ్ తన లేఖలో కోరారు. సీబీఐ వంటి కేంద్ర
దర్యాప్తు సంస్థలు చేపట్టిన విచారణల స్థితిగతులు, ఇప్పటివరకు నమోదైన చార్జ్షీట్లు, అరెస్ట్ అయిన నిందితుల వివరాలు
మరియు కేసుల క్లోజర్ రిపోర్టులపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్ని
కేసుల్లో ప్రధాన నిందితులు బెయిల్పై బయట తిరుగుతుండటం, మరికొన్ని కేసుల్లో దర్యాప్తు
సంస్థలు క్లోజర్ రిపోర్టులు సమర్పించడానికి కోర్టుల నుండి సమయం కోరుతుండటం వంటి
అంశాలను లేఖలో ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన లీకేజీలపై
తీసుకున్న చర్యలపై ప్రజల్లో స్పష్టత లేకపోవడం వల్లే విద్యార్థుల్లో తీవ్ర
అభద్రతాభావం నెలకొందని, విద్యావ్యవస్థపై యువతకు తిరిగి నమ్మకం కలగాలంటే ప్రభుత్వం
అధికారిక శ్వేతపత్రం విడుదల చేయడం ఒక్కటే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi