
బెంగళూరు,, 05 జూన్ (హి.స.)కర్ణాటక మంత్రి పదవికి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామలింగారెడ్డి రాజీనామా చేశారు. నూతన ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ క్యాబినెట్లో తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.రామలింగారెడ్డి రాజకీయంగా అత్యంత కీలకమైన 'బెంగళూరు నగరాభివృద్ధి' (Bengaluru Development) శాఖను ఆశించారు. అయితే ఆయనకు 'భారీ, మధ్యతరహా నీటిపారుదల' (Water Resources) శాఖను కేటాయించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆశించిన బెంగళూరు అభివృద్ధి శాఖను కృష్ణ బైరగౌడకు అప్పగించారు. బెంగళూరు అభివృద్ధి శాఖను తనకే ఇస్తానని సీఎం డి.కె. శివకుమార్ స్వయంగా రెండుసార్లు మాట ఇచ్చి తప్పారని, తన ఆత్మసాక్షికి విరుద్ధంగా, అవమానాలను భరిస్తూ మంత్రిగా కొనసాగలేనని రామలింగారెడ్డి పేర్కొన్నారు.తాను మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. రామలింగారెడ్డి 53 ఏళ్లుగా కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. ఆయన ఇప్పటివరకు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, గతంలో వీరప్ప మొయిలీ, ఎస్.ఎమ్. కృష్ణ, సిద్ధరామయ్య క్యాబినెట్లలో మంత్రిగా పనిచేశారు. మంత్రివర్గ విస్తరణ జరిగిన కేవలం 24 గంటల్లోనే ఈ రాజీనామా చోటుచేసుకోవడంతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర కలకలం రేగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi