
ఢిల్లీ, 07 జూన్ (హి.స.)
దేశంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను పెంచడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లో అత్యంత సరసమైన ధరకు అందుబాటులో ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారతీయ వినియోగదారులకు గ్యాస్ చాలా తక్కువ ధరకు అందుతోందని వెల్లడించింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వివరించింది.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పటికీ దేశీయ వినియోగదారులపై పూర్తి భారం మోపడం లేదని కేంద్రం పేర్కొంది. దిల్లీలో సాధారణ వినియోగదారుడు ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్కు రూ.942 చెల్లిస్తున్నప్పటికీ, మార్కెట్ ఆధారిత వాస్తవ ధరతో పోలిస్తే దాదాపు రూ.700 తక్కువగా ఉందని తెలిపింది. ఈ వ్యత్యాసాన్ని ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు భరిస్తున్నాయని వెల్లడించింది. 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం రూ.1,600కు మించి ఉందని తెలిపింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉన్న వినియోగదారులకు ప్రతి సిలిండర్పై రూ.300 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సంవత్సరానికి తొలి నాలుగు రీఫిల్లుల వరకు ఈ ప్రయోజనం వర్తిస్తుందని పేర్కొంది. ఈ సబ్సిడీ విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది.
భారత్లో గృహ వినియోగ సిలిండర్ ధరలు పొరుగు దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాకిస్థాన్లో సిలిండర్ ధర రూ.1,046, నేపాల్లో రూ.1,207, బంగ్లాదేశ్లో రూ.1,225, శ్రీలంకలో రూ.1,241గా ఉండగా, అమెరికాలో రూ.1,755, ఆస్ట్రేలియాలో రూ.1,765, కెనడాలో రూ.2,411 వరకు ఉన్నట్లు వివరించింది. వినియోగదారులు ఇంధన పొదుపు పద్ధతులను అనుసరించి సబ్సిడీ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ గణాంకాలు భారతీయ కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతును ప్రతిబింబిస్తున్నాయని కేంద్రం పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi