
కలకత్తా, 07 జూన్ (హి.స.)
గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపుపై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. తనను తాను విశ్వగురువు అని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం, పదేపదే పెరుగుతున్న ధరల షాక్ల నుండి దేశ పౌరులను రక్షించలేకపోతోందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శించింది. గృహావసరాల ఎల్పీజీ సిలిండర్పై తాజాగా ₹29 పెంచడంపై స్పందిస్తూ, అంతర్జాతీయ సంక్షోభాలు వచ్చినప్పుడు పేదలు ఆందోళన చెందుతుంటే, ధనవంతులు మాత్రం మరింత అభివృద్ధి చెందుతున్నారని, ఇదేనా బీజేపీ మోడల్ అంటూ టిఎంసి ప్రశ్నించింది. ముందస్తు ప్రణాళికలతో కుటుంబాలను రక్షించాల్సింది పోయి, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాన్ని నెడుతోందని ఆరోపించింది. ఈ ధరల పెంపు ధనవంతులకు చిన్న ఇబ్బంది కలిగించవచ్చు కానీ, ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న మిలియన్ల కొద్దీ సామాన్య కుటుంబాల బడ్జెట్ను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొంది. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర ₹913 నుండి ₹942కి పెరిగినట్లు తెలిపింది. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఏర్పడిన అంతరాయాల కారణంగా చమురు సంస్థలు గడిచిన మార్చి 7న కూడా సిలిండర్పై ₹60 పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi