
న్యూఢిల్లీ, 08 జూన్ (హి.స.)ప్రపంచ సంక్షోభం కారణంగా ఎల్పీజీ ధరల పెంపు అనివార్యంగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు పట్ల కేంద్రం కూడా బాధపడుతోందని, అలాగే విచారం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. ఇంధన రవాణా సజావుగా సాగకపోవడం, చాలా పరిమిత వనరుల నుంచే ఎల్పీజీ లభించడం వంటి సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. కర్ణాటకలోని ధార్వాడ్లో విలేకరులతో జరిగిన సంభాషణలో ప్రహ్లాద్ జోషి ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అలాగే కన్నడనాట రాజకీయాలపై కూడా ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, బంధుప్రీతి, వర్గపోరుతో సతమతమవుతోందని ఆరోపించారు. అధికార పార్టీలో అంతర్గత అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక మంత్రి రాజీనామా చేశారని, మరికొందరు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని గుర్తుచేశారు. డీకే సర్కార్ పాలన అంత సవ్యంగా లేదని ఈ పరిస్థితులే స్పష్టం చేస్తున్నాయని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi