
అట్టారీహైదరాబాద్, 08 జూన్ (హి.స.)
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ దేశ సైనికులకు ఓ అద్భుతమైన సంగీత నివాళి అర్పించారు అట్టారీ సరిహద్దులో 'జై హో - ఏ మ్యూజికల్ సెల్యూట్ టు ది బ్రేవ్హార్ట్స్' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రఖ్యాత బీటింగ్ రిట్రీట్ సెర్మనీ సమయంలో జరిగిన ఈ ఈవెంట్లో రెహమాన్ ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశభక్తి, త్యాగం, జాతీయ స్ఫూర్తిని చాటే ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన మన జాతీయ స్ఫూర్తికి, సరిహద్దుల్లో దేశ రక్షణలో ఉన్న బీఎస్ఎఫ్, ఇండియన్ ఆర్మీ సైనికులకు ఒక నివాళి. మనందరినీ కలిపి ఉంచే ప్రేమ, ఐక్యతకు ఇది ప్రతీక అని అన్నారు. తన కొత్త చిత్రం 'మై వాపస్ ఆవూంగా' గురించి ప్రస్తావిస్తూ... 1947 దేశ విభజన సమయంలో సరిహద్దులు ఏర్పడిన నాటి కథతో ఈ సినిమా వస్తోంది. ఆ సమయంలో ఇళ్లు, ప్రాణాలే కాదు, ఎన్నో హృదయాలు కూడా ముక్కలయ్యాయి. మేము ప్రేమ సందేశాన్ని అందిస్తున్నాం. ఎందుకంటే అంతిమంగా ప్రేమ మాత్రమే మనల్ని నిలబెడుతుంది అని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi