భారత్ పై 6 శాటిలైట్లతో కన్నేసిన పాకిస్థాన్!
భారత్ పై 6 శాటిలైట్లతో కన్నేసిన పాకిస్థాన్!
pak


జమ్మూకశ్మీర్, 09 జూన్ (హి.స.)

భారత భూభాగాలపై, ముఖ్యంగా జమ్మూకశ్మీర్పై నిరంతర నిఘా పెట్టేందుకు పాకిస్థాన్ తన అంతరిక్ష సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోంది. గత 16 నెలల వ్యవధిలోనే ఏకంగా 6 ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాలను ప్రయోగించింది. చైనా సహకారంతో పాక్ అంతరిక్ష పరిశోధన సంస్థ (SUPARCO) ఈ ప్రయోగాలను చేపట్టినట్లు 'ది ప్రింట్' తన పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది.

2025 జనవరి నుంచి 2026 ఏప్రిల్ మధ్య పాకిస్థాన్ ఈ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. వీటిలో కొన్నింటిని చైనాకు చెందిన లాంగ్ మార్చ్-2డి రాకెట్ల ద్వారా ప్రయోగించారు. సన్-సింక్రోనస్ కక్ష్యల్లో ప్రవేశపెట్టిన ఈ శాటిలైట్లు.. ప్రతి రెండు రోజులకు ఒకసారి భారత భూభాగంలోని కొన్ని ప్రాంతాలను స్పష్టంగా చిత్రీకరించగలవు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి పౌర ప్రయోజనాల కోసం అని చెబుతున్నప్పటికీ, సైనిక కదలికలను గుర్తించడం, రహస్య స్థావరాలను పసిగట్టడమే వీటి ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.

వీటిలో PRSC-EO3 అనే ఉపగ్రహాన్ని భారత్, పాకిస్థాన్, కశ్మీర్ ప్రాంతాలను తరచూ పర్యవేక్షించేలా ప్రత్యేక కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు అమెరికాకు చెందిన స్పేస్ అనలిటిక్స్ సంస్థ కామ్స్పాక్ (COMSPOC) విశ్లేషించింది. పాక్ అంతరిక్ష కార్యక్రమ చరిత్రలో ఇది అనూహ్యమైన వేగమని, దీని వెనుక పక్కా ప్రణాళిక ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా ఇప్పటికే తన ఉపగ్రహాలతో భారత్పై నిఘా పెడుతోందని, ఆ సమాచారాన్ని పాక్తో పంచుకుంటున్నట్లు మాజీ ఇస్రో అధికారి ఒకరు పేర్కొన్నారు.

పాకిస్థాన్, చైనాల నుంచి ఎదురవుతున్న ఈ సవాలును ఎదుర్కొనేందుకు భారత్ కూడా దీటైన ప్రణాళికతో ముందుకెళ్తోంది. 'స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్ ఫేజ్ III' కింద రూ.27,000 కోట్ల వ్యయంతో 52 ఉపగ్రహాల కూటమిని ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2025 నుంచి 2029 మధ్య ఈ ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో నిరంతర నిఘా పెట్టడమే దీని ప్రధాన లక్ష్యం.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande