
పాట్నా, 22 జూలై (హి.స.)
బిహార్ రాజధాని పట్నాలో బుధవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సదాకత్ ఆశ్రమంలోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం (పీసీసీ) వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం హింసాత్మకంగా మారింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ కాంగ్రెస్ భవన్ ముట్టడికి యత్నించారు. ముందస్తు సమాచారంతో అప్పటికే కాంగ్రెస్ శ్రేణులు అక్కడ భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు.
ఇరువర్గాల మధ్య మొదలైన తోపులాట కొద్దిసేపటికే తీవ్ర రూపం దాల్చింది. కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకుంటూ, భారీగా రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో సుమారు డజను మందికి పైగా గాయపడినట్లు జాతీయ మీడియా సమాచారం. ఈ ఘర్షణల కారణంగా రద్దీగా ఉండే దానాపూర్-గాంధీ మైదాన్ రోడ్డులో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
పరిస్థితి అదుపుతప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టి వాతావరణాన్ని శాంతింపజేశారు. ఈ ఘర్షణ జరిగిన సమయంలో బిహార్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రామ్ సహా పలువురు సీనియర్ నాయకులు పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. ఈ ఘటనపై అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో పోలీసులను భారీగా మోహరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..