
హైదరాబాద్, 25 జూలై (హి.స.)
నీట్ (NEET-UG) పరీక్షల అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఒక కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. గత నెల రోజులుగా విద్యార్థి లోకం, ప్రతిపక్షాలు చేస్తున్న ఉధృత పోరాటానికి దిగివచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. సోషల్ మీడియా వేదిక ‘X’ ద్వారా ఈ నిర్ణయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.
జంతర్ మంతర్ వద్ద తీవ్ర నిరసనలు
మే 3న జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని, విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు సాగాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP), వివిధ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ నిరసనలతో కేంద్రం తీవ్ర ఒత్తిడికి లోనైంది.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సిజేపీ ప్రతినిధులు శనివారం మూడో విడత చర్చలు జరపాల్సి ఉంది. అయితే విద్యాశాఖ మంత్రిని తొలగిస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని నిరసనకారులు ఖరాఖండిగా చెప్పారు. ఈ ఉత్కంఠకు తెరదించుతూ చర్చల కంటే ముందే ధర్మేంద్ర ప్రధాన్ వైదొలిగారు.
లేఖలో ఏముందంటే?
తన యువ మిత్రులను ఉద్దేశించి రాసిన లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ—దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థుల డిమాండ్లు ఇవే:
ప్రధానంగా ఉద్యమకారులు ప్రభుత్వం ముందు మూడు కీలక డిమాండ్లు ఉంచారు:విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.లీకేజీల మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం.శాంతియుతంగా నిరసనలు తెలిపిన విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన కేసులు పెట్టకూడదు.మంత్రి రాజీనామాతో నిరసనకారుల ప్రధాన డిమాండ్‌ను కేంద్రం నెరవేర్చినట్లయింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఈ పరిణామం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi