
ఢిల్లీ, 24 జూలై (హి.స.)
నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తాము చేపట్టిన ధర్నా కొనసాగుతుందని కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పష్టం చేశారు. గత సోమవారం ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జీకి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని CJP పిలుపునిచ్చింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం నుండి లభించిన రాతపూర్వక హామీతో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల సుదీర్ఘ నిరాహార దీక్షను గురువారం అర్థరాత్రి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో విరమించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టబోమని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, పేపర్ లీక్ నిందితులపై క్యాబినెట్ సమావేశంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి వీడియో సందేశంలో ప్రకటించగా, పార్లమెంట్‌లో ప్రకటన చేయకుండా బయట వీడియోలు విడుదల చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. భద్రతా కారణాల దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీలోని రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ సహా 17 మెట్రో స్టేషన్లను అధికారులు వరుసగా మూడో రోజు కూడా మూసివేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi