భోజశాల వివాదం; ప్రత్యామ్నాయ నమాజ్ స్థలంపై ముస్లిం వర్గం పిటిషన్ను జూలై 29న విచారించనున్న సుప్రీంకోర్టు
భోజశాల వివాదం; ప్రత్యామ్నాయ నమాజ్ స్థలంపై ముస్లిం వర్గం పిటిషన్ను జూలై 29న విచారించనున్న సుప్రీంకోర్టు
Bhojshala- man baag Devi, asi


హైదరాబాద్, 24 జూలై (హి.స.)

మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజశాల కాంప్లెక్స్ వెలుపల నమాజ్ నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ధార్ జిల్లాలోని భోజశాల సముదాయానికి దూరంగా కాకుండా, దానికి సమీపంలోనే శుక్రవారం ప్రార్థనలు (నమాజ్) చేసుకునేందుకు తగిన స్థలాన్ని కేటాయించాలని ముస్లిం పక్షం దాఖలు చేసిన తాత్కాలిక పిటిషన్‌ను జూలై 29, బుధవారం నాడు విచారిస్తామని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన ప్రత్యామ్నాయ స్థలం భోజశాల కాంప్లెక్స్ నుండి చాలా దూరంలో ఉందని, రోడ్డు మార్గం ద్వారా అది 1.3 కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల ఇప్పటికే తాము రెండు శుక్రవారాల నమాజ్ ప్రార్థనలను కోల్పోయామని ముస్లిం పక్షం తరఫు సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మది కోర్టుకు వివరించారు. అయితే ఆ ప్రదేశం కేవలం 900 మీటర్ల దూరంలోనే ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలపగా, దీనిపై స్పందించిన అహ్మది తమ వద్ద హెలికాప్టర్లు లేవని, రోడ్డు మార్గంలో వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు.

ఈ వివాదంపై తుది తీర్పు వచ్చే వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల మధ్య నమాజ్ చేసుకోవడానికి భోజశాల కాంప్లెక్స్ ఆనుకుని ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని కేటాయించాలని గత జూలై 14న సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భోజశాల కాంప్లెక్స్‌ను సరస్వతీ దేవి ఆలయంగా ప్రకటిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ముస్లిం వర్గం దాఖలు చేసిన ప్రధాన అప్పీళ్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. మరింత సమీపంలో ఉన్న స్థలాన్ని గుర్తించేలా తాము స్థానిక యంత్రాంగాన్ని ఒప్పిస్తామని ఈ సందర్భంగా సాలిసిటర్ జనరల్ ధర్మాసనానికి హామీ ఇచ్చారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande