
హైదరాబాద్, 24 జూలై (హి.స.)
నీట్ (NEET) పేపర్ లీక్‌లపై న్యాయం మరియు విద్యా సంస్కరణలు కోరుతూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న దేశ భవిష్యత్తు వారసులను మోదీ ప్రభుత్వం దేశ శత్రువులుగా పరిగణిస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జూలై 20న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు, పారామిలట్రీ దళాలు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ మరియు పెల్లెట్లతో విచక్షణారహితంగా దాడి చేయడం అత్యంత క్రూరమైన చర్య అని, ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతితోనే జరిగిందని ఆమె ఆరోపించారు. ఒక ప్రముఖ దినపత్రికలో రాసిన వ్యాసంలో దేశ విద్యా వ్యవస్థ కుప్పకూలడం వెనుక ఉన్న మూడు ప్రధాన కారణాలను సోనియా గాంధీ ప్రస్తావించారు.
మొదటిగా, మోదీ ప్రభుత్వం ప్రభుత్వ విద్యా బడ్జెట్‌ను పాఠశాల స్థాయికి 50 శాతం, ఉన్నత విద్యా స్థాయికి 33 శాతం కోత పెట్టిందని, గత 12 ఏళ్లలో దాదాపు ఒక లక్ష ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి ఆర్‌ఎస్‌ఎస్ (RSS) మరియు దాని అనుబంధ సంస్థలకు చెందిన ప్రైవేట్ స్కూళ్లకు పెద్దపీట వేసిందని ఆరోపించారు. దీనివల్ల కేవలం నీట్ కోచింగ్ కోసమే దేశంలోని కుటుంబాలు ఖర్చు పెడుతున్న మొత్తం కేంద్ర ప్రభుత్వం విద్యపై పెడుతున్న మొత్తం బడ్జెట్‌తో సమానంగా మారిందన్నారు. రెండోది, ప్రభుత్వ పరీక్షల వ్యవస్థ కేంద్రీకరణ, ప్రైవేటీకరణ వల్ల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఒక అసమర్థ సంస్థగా మారిందని, గత 12 ఏళ్లలో దేశంలో 152 పేపర్ లీక్‌లు జరిగాయని లెక్కలు చూపారు. మూడోది, చదువు పూర్తి చేసిన యువతకు మార్కెట్లో తగిన ఉపాధి లభించకపోవడం విద్యార్థులను మరింత కుంగుబాటుకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi