
లడఖ్, 25 జూలై (హి.స.)
భారతదేశం రేపు (జూలై 26) తన చారిత్రాత్మక విజయానికి గుర్తుగా 27వ కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని లడఖ్‌లోని ద్రాస్ అమరవీరుల స్మారకం (కార్గిల్ వార్ మెమోరియల్) వద్దకు చేరుకున్న శతాధిక వీర జవాన్ల కుటుంబ సభ్యులు భావోద్వేగాల మధ్య తమ కన్నవారు, భర్తలు చేసిన అత్యున్నత త్యాగాలను స్మరిస్తూ శనివారం ఘన నివాళులు అర్పించారు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ ప్రాణాలు అర్పించిన వీరుల వారసత్వాన్ని మోయడం తమకు గర్వకారణమని వారు ఈ సందర్భంగా చాటిచెప్పారు.ఈ వేడుకల్లో పాల్గొన్న అమరవీరుడు లాన్స్ నాయక్ మహమ్మద్ అస్లాం కుమారుడు మహమ్మద్ అఫ్జల్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం తాము ద్రాస్ సందర్శిస్తామని, నాన్నను చూసిన జ్ఞాపకాలు లేకపోయినా సైన్యం మరియు కుటుంబం ద్వారా ఆయన శౌర్యాన్ని వింటూ గర్వపడుతున్నానని, భవిష్యత్తులో తాను కూడా దేశం కోసం సైన్యంలో చేరి సేవ చేస్తానని ఆకాంక్షించారు. అలాగే 17 జాట్ రెజిమెంట్‌కు చెందిన అమరవీరుడు ధరమ్‌వీర్ సింగ్ భార్య విద్యాదేవి మాట్లాడుతూ.. ఈ మంచు పర్వతాలను చూస్తుంటే తన భర్త చూపిన ధైర్యం కళ్లముందు కదలాడుతోందని, అప్పట్లో ఫోన్లు లేకపోయినా ఉత్తరాల ద్వారానే కమ్యూనికేట్ చేసుకునేవాళ్లమని గుర్తుచేసుకుంటూ దేశం కోసం సర్వస్వం అర్పించిన వీరుడి భార్యగా తాను గర్విస్తున్నానని సలాం చేశారు.మరోవైపు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం నుండే కార్గిల్, లడఖ్ ప్రాంతాలలో రెండు రోజుల పర్యటనను ప్రారంభించనున్నారు. జూలై 26న ద్రాస్‌లో జరగనున్న ప్రధాన కార్గిల్ విజయ్ దివస్ అధికారిక వేడుకల్లో ఆయన స్వయంగా పాల్గొని సైనిక వందనం స్వీకరిస్తారు. కాగా, నిన్ననే (శుక్రవారం) పార్లమెంట్ ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభలలో రక్షణ దళాల పరాక్రమాన్ని కొనియాడుతూ, దేశ సమగ్రతను కాపాడిన అమరవీరులకు ఎంపీలందరూ నిలబడి ఘనంగా నివాళులర్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi