
హైదరాబాద్, 26 జూలై (హి.స.)ప్రైవేటు కంపెనీలు, వాటి ఉద్యోగులపై ఇచ్చే ఫిర్యాదులను విచారించే పరిధి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) చట్టం ప్రకారం కమిషన్ పరిధి కేవలం ప్రభుత్వ ఉద్యోగులు వారి నిర్లక్ష్యానికి సంబంధించిన అంశాలకే పరిమితమని స్పష్టతనిచ్చింది. కంపెనీలో వేధింపులకు సంబంధించి ఇద్దరు మహిళా ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదులపై హెచ్ఆర్సీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వెల్స్ ఫర్గో ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులపై కంపెనీ స్పందించలేదని ఇద్దరు మహిళా ఉద్యోగులు హక్కుల కమిషన్ను ఆశ్రయించారని, ఇది కంపెనీ అంతర్గత విషయమని తెలిపింది. ఉద్యోగానికి సంబంధించిన వివాదాలు, కార్యాలయంలో వేధింపులు, పనితీరు అంచనా తదితరాలన్నీ యజమాని, ఉద్యోగికి మధ్య సంబంధాలేనని, వీటిపై విచారించడానికి సమర్థ వేదికలున్నాయని తెలిపింది. ఆరోపణలు తీవ్రమైనవన్న కారణంగా పరిధి లేకుండా ఫిర్యాదులను స్వీకరించరాదంది. కార్యాలయంలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు తీవ్రమైన అంశమేనని, అయితే వీటి కోసం పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉందని, వాటి ప్రకారం చర్యలకు సంబంధిత సంస్థలను ఆశ్రయించవచ్చంది. కంపెనీ దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ దానిపై హక్కుల కమిషన్ వద్ద పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను కొట్టివేసింది. ప్రతివాదులైన బాధిత మహిళలు చట్టప్రకారం సంబంధిత సంస్థలను ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్