
హైదరాబాద్, 27 జూలై (హి.స.)
సుప్రీంకోర్టు సీజేఐ వ్యాఖ్యలకు
నిరసనగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నీట్ పేపర్ లీక్ పై ఉద్యమం చేసి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో మరో ఉ ఉద్యమం మొదలైంది. 'రిజర్వేషన్ హటావో ఆందోళన్' (RHA) పేరుతో మొదలైన ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. దేశంలో ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని, ప్రతీ ఒక్కరికీ సమానమైన విద్య, అవకాశాలు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేస్తూ ఈ పేజీని ప్రారంభించారు.
ప్రస్తుతం ఈ డిజిటల్ ఉద్యమానికి సామాజిక మాధ్యమాల్లో అనూహ్య స్పందన లభిస్తోంది. కొద్ది సమయంలోనే ఈ పేజీ ఏకంగా 34 లక్షలకు పైగా ఫాలోవర్లను సాధించి నెట్టింట సరికొత్త చర్చకు తెరలేపింది. కాగా, ఈ ప్రచారంపై 'రిజర్వేషన్ హటావో ఆందోళన్' (RHA) ప్రతినిధులు స్పందిస్తూ.. తమకు ఏ రాజకీయ పార్టీతోనూ ఎలాంటి సంబంధం లేదని, ఇది ఏ రకమైన రాజకీయ ప్రాతిపదికన నడిచేది కాదని స్పష్టం చేశారు. చట్టాల్లో, ప్రభుత్వ నిబంధనల్లో ఎక్కడా కులం (క్యాస్ట్) ప్రస్తావన లేకుండా సరికొత్త చట్టాన్ని తీసుకురావాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని వారు స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగ అవకాశాలలో ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ అందరికీ సమాన ప్రాతిపదికన ఫలాలు అందేలా చట్ట సవరణలు చేయాలని RHA సబ్యులు డిమాండ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు