
వరంగల్, 27 జూలై (హి.స.)ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతు ట్రాక్టర్ కొని రిజిస్ట్రేషన్కు వెళ్లారు. రవాణా అధికారులు పట్టాపాస్ పుస్తకం అడిగారు. తన పేరిట ఉన్న రెండెకరాల పట్టా పాస్బుక్ చూపించారు. కనీసం మూడెకరాలు ఉండాలనడంతో విధిలేక వెనుదిరిగారు.
వ్యవసాయ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ కోసం కచ్చితంగా ఇంత భూమి ఉండాలని ఎక్కడా పేర్కొనకున్నా... కొందరు వ్యవసాయం కోసమని చెప్పి వాణిజ్య అవసరాలకు వాడుతున్నారని అధికారులు విచక్షణతో ఆయా జిల్లాను, అక్కడి భూ విలువను బట్టి భూ విస్తీర్ణం చూపించాలని కోరుతున్నారు. ‘వ్యవసాయ ట్రాక్టర్’ అంటే ఏ పనులకు వాడాలి, కొన్న రైతు సాగుభూమి నుంచి ఎంత పరిధిలో తిరగాలి, ట్రాలీ సామర్థ్యం వంటి వివరాలు 2014లో విడుదలైన జీవోలో ఉన్నాయి.
‘రైతు యాజమాన్యంలో ఉన్న లేదా అధీనంలో ఉన్న భూమి నుంచి ట్రాక్టర్ 24 కిలోమీటర్ల పరిధిలో వ్యవసాయ అవసరాలకు మాత్రమే తిరగాలి’ అని అందులో ఉంది. భూమి విస్తీర్ణం ప్రస్తావించలేదు. గత ప్రభుత్వం నుంచి వ్యవసాయ విభాగం ట్రాక్టర్కు పూర్తిగా పన్ను మినహాయింపు అమలవుతోంది. దీంతోపాటు ప్రభుత్వ యాంత్రీకరణ పథకం కింద మంజూరయ్యే ట్రాక్టర్కు 50 శాతం వరకు రాయితీ లభిస్తుంది. ట్రాక్టర్కు అమర్చే ఫుల్ వీల్స్, హాఫ్ వీల్స్, రొటోవేటర్ వంటి పరికరాలు 50 శాతం రాయితీకే లభిస్తాయి. వ్యవసాయ కూలీలను, ఇతర వ్యవసాయ సంబంధిత సామగ్రి తరలించడం, పక్క రైతు భూములు దున్నడమూ వాణిజ్యం విభాగంలోనే వస్తాయి. అంటే దానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అధికారులు విస్తీర్ణం గురించి అడుగుతుండడంతో ఏం చేయాలో తోచని రైతులు చివరికి ఏజెంట్ల వద్దకు వెళ్తున్నారు. పైగా ట్రాక్టర్లు వాహన్ పోర్టల్ పరిధిలోకి రాకపోవడంతోనూ రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోందనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని ఆర్టీవో కార్యాలయాల సిబ్బంది ట్రాక్టర్, ట్రాలీలను కమర్షియల్గా మారుస్తామని సతాయించి చివరికి అంతోఇంతో తీసుకొని పని కానిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు కౌలు రైతులు అనివార్యంగా ట్రాక్టర్లను వాణిజ్య విభాగంలోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రైతు స్వరాజ్య వేదిక సర్వే ప్రకారం రాష్ట్రంలో 20లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్