జూరాలను తాకిన కృష్ణమ్మ
జూరాలను తాకిన కృష్ణమ్మ
jurala


జూరాల, 27 జూలై (హి.స.)

ఎట్టకేలకు కృష్ణమ్మ జూరాలను తాకింది. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంకు వరద ప్రవాహం పెద్దఎత్తున చేరుతుండడం, నారాయణపూర్‌ డ్యాం కూడా నిండుతుండడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాలకు ఆదివారం ఉదయం నుంచి కొద్దికొద్దిగా వరద ప్రారంభమై మధ్యాహ్నం వరకు 18 వేలు, రాత్రికి 22,600 క్యూసెక్కులకు చేరింది. సోమవారం మరింత పెరిగే అవకాశం ఉంది. నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి 35వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. ప్రస్తుతం జూరాల జలాశయంలో నీటి నిల్వ 5.897 టీఎంసీలకు చేరింది. ఆలమట్టిలో వరద ప్రవాహం ఇదే తరహాలో కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రవాహం మొదలయ్యే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టానికి నిల్వలు చేరిన తర్వాతే ఎత్తిపోతల పథకాలకు, కాలువలకు నీరందిస్తామని ఆ ప్రాజెక్టు డీఈ నాగేశ్వర్‌ రావు తెలిపారు. కాగా, నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలో ఉన్న మహాత్మాగాంధీ లిఫ్టు ఎత్తిపోల పథకం (ఎంజీఎల్‌ఐ) ద్వారా ప్రధాన రిజర్వాయర్లకు సోమవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు ఇన్‌చార్జి ఈఈ లోకిలాల్‌ తెలిపారు. సింగోటం, జొన్నగబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లను నిరంతరాయంగా నింపనున్నట్లు స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande