
హైదరాబాద్, 27 జూలై (హి.స.)
పట్టణ గృహనిర్మాణ పథకం కింద కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇళ్ల (ఫ్లాట్ల) కేటాయింపు తరువాతే నిర్మాణాలు చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యేలోపు టవర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల వ్యవహారాన్ని కూడా పూర్తిచేసేందుకు హౌసింగ్ బోర్డు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మహానగరం పరిధిలోని 24 నియోజకవర్గాల్లో.. ఇప్పటివరకు స్థలాలు గుర్తించిన 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఎల్‌ఐజీ టవర్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. బుధవారం (ఈ నెల 29) నుంచి ఆగస్టు 19 మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లను స్వీకరించనున్నారు. మొత్తం 16 ప్రాంతాల్లో నిర్మించే ఇందిరమ్మ ఎల్‌ఐజీ టవర్లను 10 ప్యాకేజీలుగా విభజించి టెండర్లను ఆహ్వానించారు. ఒక్కో టవర్‌ను స్టిల్ట్ + 10 అంతస్తులతో నిర్మించాలని టెండర్ నోటీసులో పేర్కొన్నారు. నిర్మాణాన్ని సంప్రదాయ/మోనోలిథిక్ కాంక్రీట్ నిర్మా ణం లేదా మరేదైనా వినూత్న సాంకేతికత (షీర్‌వాల్ టెక్నాలజీ/ప్రీకాస్ట్ టెక్నాలజీ లేదా తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆమోదించిన విధంగా)తో ఒక్కో ఫ్లాట్‌ను 528.58 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని పేర్కొన్నారు. దీంతోపాటు నేల పరిస్థితులకు తగిన పునాదులు, సివిల్ పను లు, అంతర్గత మౌలిక సదుపాయాల కింద నీటి సరఫరా, శానిటరీ ఫిట్టింగ్‌లు, అంతర్గత విద్యుదీకరణ, లిఫ్టులు, ఫైర్ సేఫ్టీతో నిర్మాణాలు ఉండాలని టెండర్ నోటీ్‌సలో పొందుపరిచారు. అంతేకాకుండా.. ఈ పనులన్నింటికీ రెండేళ్ల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ (నిర్మాణంలో ఏవైనా లోపాలు, తప్పులు ఉంటే వాటికి నిర్మాణ సంస్థే బాధ్యత వహించే) నిబంధనను కూడా పెట్టారు. జీహెచ్‌ఎంసీ లైసెన్స్ ఉన్న బిల్డర్లు ఈ టెండర్లలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తొలిసారిగా ఇంజనీరింగ్-ప్రొక్యూర్‌మెంట్-కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ విధానం ఎక్కువగా జాతీయ రహదారులు, రాష్ట్రంలోని ప్రత్యేక కారిడార్ల నిర్మాణంలో ఉంటుంది. త్వరితగతిన నిర్మాణం, నాణ్యతతో ఉండేందుకే ఈపీసీ పద్ధతిని తీసుకొస్తున్నట్టు హౌసింగ్ బోర్డు ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. హౌసింగ్ బోర్డు టెండర్ నోటీ్‌సలో ఇచ్చిన ప్యాకేజీల ప్రకారం.. ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోనే దాదాపు 3,500 ఫ్లాట్లు రానున్నాయి. ఆ తరువాత రంగారెడ్డి జిల్లాకు 1,920, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు 1,920 చొప్పున ఫ్లాట్లు దక్కనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi