
హైదరాబాద్, 27 జూలై (హి.స.)రైతులతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) చేసుకున్న ఆరు నెలల తర్వాత కొనుగోలు రేటు తగ్గించాలని డిస్కంలు ఈఆర్సీని కోరడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. డిస్కంల వైఖరిని తప్పుబడుతూ పెద్దసంఖ్యలో రైతులు, సౌర విద్యుత్ కంపెనీలు ఈఆర్సీకి ఫిర్యాదులు చేస్తున్నాయి. ‘పీఎం కుసుమ్’ పథకం కింద రైతులు తమ పొలాల్లో సౌరవిద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుచేయడానికి గతేడాది రెడ్కో టెండర్లు పిలిచింది. ఇక్కడ ఉత్పత్తయ్యే కరెంటును రాబోయే పాతికేళ్ల పాటు యూనిట్కు రూ.3.13 చొప్పున చెల్లించి తెలంగాణ డిస్కంలు కొంటాయని టెండర్ ప్రకటనలో తెలిపింది. ఈ కొనుగోలు ధరను 2021 జనవరి 2న ఈఆర్సీ ఖరారుచేసి ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు 2025 అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ 1,180 మంది రైతుల ప్లాంట్ల నుంచి 1,765 మెగావాట్ల సౌర విద్యుత్ను కొంటామని డిస్కంలు పీపీఏలు కూడా చేసుకున్నాయి.
జీఎస్టీ తగ్గిందనే సాకుతో.. కానీ, 2025 సెప్టెంబరులో సౌరవిద్యుత్ పరికరాలు, మాడ్యూల్స్, సెల్స్పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి కేంద్రం తగ్గించింది. ఈ నేపథ్యంలో ప్లాంటు ఏర్పాటు వ్యయం తగ్గుతుందని.. ఈ మేరకు కరెంటు కొనుగోలు రేటును యూనిట్కు రూ.3.13 నుంచి రూ.2.98కి తగ్గించాలని ఈఆర్సీలో డిస్కంలు పిటిషన్ దాఖలు చేశాయి. అయితే, టెండర్ ప్రకటనలో తెలిపిన, పీపీఏలో పేర్కొన్న రూ.3.13ను ఆ తర్వాత ఎలా తగ్గిస్తారని పెద్దసంఖ్యలో రైతులు ఈఆర్సీకి అభ్యంతరాలు తెలుపుతూ రాతపూర్వక ఫిర్యాదులిస్తున్నారు. ఇలా యూనిట్కు 15 పైసలు ఏకపక్షంగా తగ్గించడం వల్ల పాతికేళ్లలో ఒక మెగావాట్కు రూ.62.50 లక్షల చొప్పున 1,765 మెగావాట్లకు రూ.1,103 కోట్ల ఆదాయాన్ని రైతులు కోల్పోతారని తెలంగాణ రాష్ట్ర సోలార్ ఓపెన్ యాక్సిస్ డెవలపర్స్ అసోసియేషన్ సమగ్ర వివరాలతో ఈఆర్సీకి ఫిర్యాదు చేసింది. డిస్కంల పిటిషన్ ఆమోదిస్తే రాష్ట్రంలో సౌరవిద్యుత్ ప్లాంట్లను పెట్టడానికి పెట్టుబడులు రావని తెలిపింది. కాళేశ్వరం గ్రామంలో 2 మెగావాట్ల ప్లాంటు పెట్టడానికి భూమి ధర కాకుండానే తనకు రూ.7.90 కోట్ల వ్యయమైందని ఓ రైతు ఈఆర్సీకి తెలిపారు. అన్ని రేట్లూ పెరుగుతుంటే కరెంటు కొనుగోలు రేటు ఎలా తగ్గిస్తారని రైతులు వాపోతున్నారు. ఈ పిటిషన్లపై వచ్చే నెల 4న బహిరంగ విచారణ చేస్తామని ఈఆర్సీ తాజాగా ప్రకటన జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్