ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి : కలెక్టర్ కె. హైమావతి
ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి : కలెక్టర్ కె. హైమావతి
Collector


సిద్దిపేట, 27 జూలై (హి.స.)

ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి రైతులకు సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళను ప్రారంభించి రైతులకు విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణంగా 256 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 176 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందన్నారు. హుస్నాబాద్, వర్గల్, ములుగు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. వరి పండిస్తే ఒక ఎకరానికి రోజుకు 25 వేల లీటర్ల నీరు అవసరమవుతుందని, అదే నీటితో ఆరు నుంచి ఎనిమిది ఎకరాల్లో మెట్ట పంటలను పండించవచ్చని అన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు మొక్కజొన్న, పెసలు, మినుములు, అలసందలు, వేరుశనగ తదితర పంటలను సాగు చేసుకోవచ్చని తెలిపారు.

వర్షాభావ పరిస్థితుల్లో పండే రాగులు, కందులు, పొద్దుతిరుగుడు, మిల్లెట్స్, కొర్రలు, అరికెలు, ఆముదం తదితర పంటలను ఆగస్టు 30వ తేదీ వరకు విత్తుకోవచ్చని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగు చేస్తే డ్రిప్ ఇరిగేషన్, అంతర పంటలకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. జిల్లాలో కూరగాయలు, ఆకుకూరలకు మంచి మార్కెట్ ఉందని, వాటి సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్లు నిర్మించి నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. శాస్త్రవేత్తల సలహాలు, తమ అనుభవాలను ఉపయోగించుకొని లాభదాయక పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande