
హైదరాబాద్, 26 జూలై (హి.స.)క్యూర్’ పరిధిలో పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు అందించనున్న ‘ఇందిరమ్మ టవర్స్’కు సంబంధించి సందేహాల నివృత్తికి హౌసింగ్ బోర్డు ప్రత్యేక కాల్సెంటర్ హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. ఈ పథకంపై ప్రజల్లో ఎలాంటి గందరగోళం, అపోహలు లేకుండా దరఖాస్తు విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలు, చెల్లింపులు, ఇళ్ల కేటాయింపులపై 040-24603572 నంబరును సంప్రదిస్తే పూర్తి సమాచారాన్ని అందిస్తారు. హైదరాబాద్లోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో శనివారం రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కాల్ సెంటర్ను ప్రారంభించి మాట్లాడారు. ‘‘ప్రజలు తమ సందేహాలపై మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా కాల్ సెంటరుకు ఫోన్ చేయాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఫోన్ చేసి అధికారిక సమాచారాన్ని పొందవచ్చు. దరఖాస్తుదారుల సౌకర్యార్థం తెలుగు, హిందీ, ఇంగ్లిషు, ఉర్దూ భాషలతో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల లక్ష్యంలో భాగంగా తొలి విడతగా 7,680 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రజలు ఏ నియోజకవర్గంలో నివాసం ఉంటే అక్కడే ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే చేయాలి. దరఖాస్తు సమయంలో రూ.10 వేల చెల్లింపునకు యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ను మాత్రమే ఉపయోగించాలి. ఒక వేళ ఇల్లు మంజూరు కాకపోతే తిరిగి అదే ఖాతాకు ఆ మొత్తం వాపసు పంపిస్తారు. అర్హత ఉన్న కుటుంబానికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తారు’’ అని మంత్రి వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్