
హైదరాబాద్, 26 జూలై (హి.స.)తెలంగాణలో ఎల్నినో నేపథ్యంలో జీరాంజీ పథకంలో నీటి సంరక్షణ కోసం చేపట్టిన ‘జలసిరి’ కార్యక్రమం కింద ఆగస్టు 15 నాటికి లక్ష ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ లక్ష్యాన్ని సాధించిన అధికారులు, గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా సన్మానిస్తామని తెలిపారు. శనివారం సచివాలయంలో జీరాంజీ పథకంపై మంత్రి తమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్, కమిషనర్ దివ్యాదేవరాజన్లతో కలిసి సచివాలయం నుంచి అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘గ్రామీణ కుటుంబాలకు ఉపాధి, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే ఇంకుడు గుంతలు, పంటకుంటలు, ఊటకుంటలు, బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాల వంటి పనులను జలసిరి కింద యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎల్నినో పరిస్థితులున్నా తెలంగాణలో వంద రోజుల వరకు తాగునీటి సమస్య లేదని మంత్రి తెలిపారు. మిషన్ భగీరథపై శనివారం ఆమె సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పైప్లైన్ లీకేజీలు, మరమ్మతుల కారణంగా ఒక్క రోజైనా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే పరిస్థితి వస్తే ముందుగానే ఆయా గ్రామాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్