నేరాల నియంత్రణే లక్ష్యం.. కోదాడలో పోలీసుల ప్రత్యేక తనిఖీలు
నేరాల నియంత్రణే లక్ష్యం.. కోదాడలో పోలీసుల ప్రత్యేక తనిఖీలు
Police


కోదాడ, 26 జూలై (హి.స.)

ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడంతో పాటు నేరాల నియంత్రణే లక్ష్యంగా కోదాడ డివిజన్ పోలీసులు చేపట్టిన 'కట్టడి-ముట్టడి' కార్యక్రమంలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, ఒక కారును సీజ్ చేయడంతో పాటు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి యువతకు పలు కీలక సూచనలు చేశారు. ఆదివారం తెల్లవారుజామున కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ ప్రాంతంలో పట్టణ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక నాకాబందీ చేపట్టారు. నివాసాలు, వాహనాలు, దుకాణాలను క్షుణ్నంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు కోదాడ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కట్టడి-ముట్టడి, పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మరింత చేరువై నేరాలను నియంత్రించడం, శాంతిభద్రతలు పరిరక్షించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్న చిన్న గొడవలు, గ్రూపు తగాదాల పేరుతో దాడులు చేసుకుని జీవితాన్ని కేసుల పాలు చేసుకోవద్దని సూచించారు. సమస్యలు ఎదురైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను ఆశ్రయించాలని, చట్టానికి లోబడి నడుచుకోవాలని హితవు పలికారు. నేరాలకు దూరంగా ఉంటేనే యువత భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande