
హైదరాబాద్, 26 జూలై (హి.స.)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులైన భారత సాయుధ బలగాల సైనికులకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హృదయపూర్వక నివాళులర్పించారు. మన మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన ఆ వీరయోధుల అద్వితీయ పరాక్రమం, అచంచల సంకల్పం, అసమాన దేశభక్తి మన సైన్యపు అద్భుత సంప్రదాయాలకు నిదర్శనాలని రాష్ట్రపతి కొనియాడారు. వారి శౌర్యగాథలు భవిష్యత్ తరాలకు దేశ సేవ మరియు కర్తవ్య నిర్వహణ మార్గంలో నడవడానికి నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని, ఈ దేశం వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, అత్యంత క్లిష్టమైన మరియు ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొని భారత భద్రత కోసం మన సైనికులు చూపిన అసాధారణ ధైర్యసాహసాలు, అంకితభావానికి దేశం మొత్తం కృతజ్ఞతలు తెలుపుతోందని అన్నారు. రణరంగంలో వారు ప్రదర్శించిన శౌర్యం ఎప్పటికీ జాతీయ గర్వకారణంగా నిలిచిపోతుందని, వారి అచంచల దేశభక్తి తరతరాలకు స్ఫూర్తిదాయకంగా మారుతుందని ప్రధాని తన సందేశంలో కొనియాడారు. వీరితో పాటు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కార్గిల్ అమరవీరులను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. 1999 కార్గిల్ యుద్ధంలో ఆపరేషన్ విజయ్ ద్వారా శతృవులను లొంగదీసుకుని సాధించిన ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తుగా ప్రతి ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi