
హైదరాబాద్, 26 జూలై (హి.స.)
కొచ్చి:మైదానంలో ఆడే ఆటను, తరగతి గదిలో నేర్చుకునే పాఠాన్ని ఒకేతాటిపైకి తీసుకురావచ్చా? అంటే సాధ్యమేనని నిరూపించారు కేరళలోని ఎర్నాకుళం జిల్లా సౌత్ చిత్తూర్‌కు చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయుడు. సాంప్రదాయ భాష అయిన సంస్కృతాన్ని, విద్యార్థులకు ఎంతగానో నచ్చే ఫుట్‌బాల్ ఆటతో ముడిపెడుతూ ఆయన రూపొందించిన వినూత్న ప్రాజెక్ట్ ‘అక్షరకందుకం’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఈ ప్రయోగాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.సౌత్ చిత్తూర్‌లోని సెయింట్ మేరీస్ పాఠశాలలో 2015 నుండి సంస్కృత ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న అభిలాష్ ఈ అద్భుతమైన ఆలోచనకు రూపకల్పన చేశారు. సాధారణ నేపథ్యం నుండి వచ్చే ఒకటో తరగతి నుండి ఏడో తరగతి విద్యార్థులకు సంస్కృతం నేర్చుకోవడం కొంత కష్టంగా అనిపించడంతో, వారికి ఇష్టమైన క్రీడ ద్వారా భాషను సులభంగా నేర్పించాలని ఆయన భావించారు. ఈ క్రమంలోనే ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీల స్ఫూర్తితో సాంకేతిక పదాలను సంస్కృత అక్షరాలతో అనుసంధానించారు.ఈ విధానంలో ఫుట్‌బాల్ ఆటలోని పాసింగ్, డ్రిబ్లింగ్, గోల్స్ చేయడం వంటి సాంకేతిక పదాలను సంస్కృత వ్యాకరణ నియమాలతో ముడిపెడతారు. ఉదాహరణకు 'న' అనే అక్షరాన్ని నేర్పడానికి సంస్కృతంలో కెప్టెన్ అని అర్థం వచ్చే 'నాయకః' అనే పదాన్ని, 'య' అనే అక్షరానికి కీర్తి అని అర్థం వచ్చే 'యశః' అనే పదాన్ని ఉపయోగిస్తారు. విద్యార్థులకు మరింత సులభంగా అర్థం కావడానికి వీటి అర్థాలను ఇంగ్లీష్, మలయాళ భాషల్లో అందమైన చార్టులు, పోస్టర్ల రూపంలో ప్రదర్శిస్తారు. ఈ విధంగా మైదానంలో పిల్లలు ఉత్సాహంగా బంతిని తన్నుతూనే, తమకు తెలియకుండానే సంస్కృత అక్షరాలను, వ్యాకరణాన్ని ఎంతో సులభంగా నేర్చుకుంటున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi