
శ్రీకాళహస్తి, 26 జూలై (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30న శ్రీకాళహస్తిలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎస్వీఏ ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 12 ప్రముఖ కంపెనీలు పాల్గొని మొత్తం 861 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయని చెప్పారు.
పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభించే అవకాశముందని తెలిపారు. అభ్యర్థులు జూలై 29లోపు నైపుణ్యం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV