
హైదరాబాద్, 27 జూలై (హి.స.)
నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం మరియు ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు (2026 జూలై 27, సోమవారం) భారీ ఎజెండాతో తిరిగి ప్రారంభం కానున్నాయి. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు మరింత కఠినమైన నిబంధనలతో కూడిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు-2026'ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లకు పాల్పడే ముఠాలపై ఉక్కుపాదం మోపేలా ఈ కొత్త ప్రతిపాదనలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు భారీ జరిమానా, నిందితుల ఆస్తుల జప్తు మరియు మూడు నెలల్లోనే తీర్పు వచ్చేలా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ మెకానిజం వంటి కఠిన నిబంధనలను చేర్చారు. ఇది దేశంలో పరీక్షల పారదర్శకతను పెంచేందుకు చారిత్రాత్మకమైన రోజని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. మరోవైపు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో, జూలై 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్లతో జరిపిన దాడిపై లోక్‌సభలో తక్షణ చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. రాజ్యసభలో కూడా నీట్ అభ్యర్థుల సమస్యలపై చర్చించేందుకు డీఎంకే (DMK) సభను వాయిదా వేయాలని నోటీసు సమర్పించింది. అయితే సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. పరీక్షల ప్రక్రియ డిజిటలైజ్ అయిన తర్వాతే హ్యాకింగ్, పేపర్ లీక్‌లు ఎక్కువయ్యాయని, కేవలం చట్టాలు తెస్తే సరిపోదని విమర్శించారు. కాగా, నేటి సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లును లోక్‌సభలో, జాతీయ గౌరవానికి భంగం కలిగించే చర్యల నిరోధక సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi