
ఉండ్రాజవరం, 30 జూలై (హి.స.)
:ఆంధ్రప్రదేశ్లో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. ఉత్తర భారతదేశం తరహాలోనే ఏపీలో కూడా బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కోరినట్టు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో రాష్ట్రంలోనే తొలిసారిగా కోట్లాది రూపాయల వ్యయంతో బుద్ధగయ తరహాలో నిర్మించిన మైత్రేయ బుద్ధవిహార్ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ... మైత్రేయ బుద్ధవిహార్ను ప్రధాన పర్యాటక కేంద్రంగా విశ్వవ్యాప్తం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని ఆదుర్రు, బావికొండ, తొట్లకొండ, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల, ఉండ్రాజవరం వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలోనే బుద్ధిస్ట్ సర్క్యూట్ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. తొలుత మంత్రి దుర్గేశ్ జాతీయ జెండాను ఎగురవేయగా.. ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీలంకలోని నాగానంద ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఫౌండర్, వైస్చాన్సలర్ బోదగమా ఛాందిమా తెరో బుద్ధిజం జెండాను ఆవిష్కరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ