
హైదరాబాద్, 30 జూలై (హి.స.)
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు కలెక్టర్లు అత్యవసర సెలవు ప్రకటించారు.
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు తోడు, రానున్న మూడు రోజులు మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ రీజియన్లలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తూ జిల్లా యంత్రాంగాలు ఉత్తర్వులు ఇచ్చాయి. ముఖ్యంగా నిర్మల్, జగిత్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, మరియు నిజామాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
భారీ వర్షాల వల్ల కోల్పోయిన విద్యా దినాన్ని భర్తీ చేసేందుకు, ఈ సెలవుకు ప్రత్యామ్నాయంగా రాబోయే ఆగస్టు 8వ తేదీన (రెండో శనివారం) పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను బయటకు పంపవద్దని కలెక్టర్లు విజ్ఞప్తి చేశారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi