
అమరావతి, 30 జూలై (హి.స.)
రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ల జారీలో ప్రభుత్వం మార్పులు చేసింది. షెడ్యూలు ప్రకారం రెండో విడత నోటిఫికేషన్లు ఆగస్టు 15న విడుదల చేయాలి. అయితే, రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, సాంకేతిక కారణాలు, ఉద్యోగ సంఘాల వినతుల నేపథ్యంలో రెండో విడత ఇవ్వాల్సిన నోటిఫికేషన్లను సెప్టెంబరు 15కు వాయిదా వేసింది. 2026 జాబ్ క్యాలెండర్లో మొత్తం 4 దశల్లో 10,060 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం క్యాలెండర్ రూపొందించింది.
తొలి దశలో యూనివర్సిటీల్లో 1,523 పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్ జారీచేశారు. ఈ క్రమంలో తర్వాత విడుదల చేయాల్సిన జాబ్ క్యాలెండర్లపై చర్చించేందుకు మంత్రి లోకేశ్ ఆధ్వర్వంలో బుధవారం మంత్రుల బృందం భేటీ అయింది. రెండో విడత నోటిఫికేషన్లను సెప్టెంబరు 15న విడుదల చేయాలని నిర్ణయించారు. మూడు, నాలుగు విడతల నోటిఫికేషన్లను అక్టోబరు 15న విడుదల చేయనున్నారు. మూడో దశలో 2,388, నాలుగో దశలో 2,981 పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూప్-1 ఉద్యోగాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. వివాదాలకు తావులేకుండా సకాలంలో ఉద్యోగాల భర్తీ జరగాలన్నారు. ఈ ఏడాది జాబ్ క్యాలెండర్కు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే నెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ