
ములుగు, 04 జూలై (హి.స.)
తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, కేంద్రం వాటాను పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. శనివారం ఢిల్లీలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మహిళలు, చిన్నారులు, పోషకాహారం, ప్రజారోగ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు బ్రేక్ఫాస్ట్(ఉదయం అల్పాహారం) కార్యక్రమం అమలు చేయడానికి అవసరమైన కేంద్ర ఆర్థిక సహాయాన్ని అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు మరింత మెరుగైన పోషకాహారం అందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు కేంద్రం వాటా పెంచాలని, ప్రస్తుతం వారు అందిస్తున్న సేవలకు తగిన గౌరవం, మెరుగైన పారితోషికం లభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. టేక్ హోమ్ రేషన్ పథకంలో రక్తహీనత నివారణ కోసం ప్రత్యేక పోషకాహార కార్యక్రమాన్ని ప్రవేశపెట్టేందుకు 100 కోట్ల నిధులు మంజూరు చేయాలని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం మరింత సహకారం అందించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..