
అనపర్తి గ్రామీణం, 04 జూలై (హి.స.)
: కూటమి ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, చిత్తశుద్ధితో పనిచేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు, మహేంద్రవాడ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి హోం మంత్రి శ్రీకారం చుట్టారు. అనంతరం పొలమూరులో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. మహేంద్రవాడలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో కేవలం రెండేళ్లలో రూ.700 కోట్ల భారీ వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. వచ్చే మూడేళ్లలో అనపర్తిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉండటం అనపర్తి ప్రజల అదృష్టమని ప్రశంసించారు. అనపర్తిలో కూటమిలోని మూడు పార్టీల నేతలు ఎంతో సమన్వయంతో ముందుకెళ్తున్నారని, అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే స్ఫూర్తితో కొనసాగాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేతలు ఎన్ని అసత్యాలు మాట్లాడినా ప్రజలు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ